ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని విల్లాను కొనేవారే కరువయ్యారు. విల్లా రిజర్వు ధరను 5 శాతం తగ్గించి.. రూ.81 కోట్లుగా నిర్ణయించినా కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. మాల్యా నుంచి రూ.9,000 కోట్ల రుణ మొత్తాన్ని రాబట్టుకోవడానికి బ్యాంక్ కన్సార్షియం విల్లాను విక్రయానికి పెట్టిన ప్రతిసారీ విఫలమౌతూనే ఉంది. ‘డీమోనిటైజేషన్ కారణంగా రియల్టీలో స్తబ్ధత నెలకొంది. ప్రాపర్టీ ధరలు తగ్గాయి. దీంతో బ్యాంకుల కన్సార్షియం విల్లా ధరను మరింత తగ్గించొచ్చని బిడ్డర్లు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుత వేలానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.