రాష్ట్రంలో ఏటా వ్యవసాయ వృద్ధి రేటు ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది. గత రెండేళ్లలో అయితే మరింత ఘోరంగా దిగజారడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభాన్ని, అన్నదాతల దుస్థితిని కళ్లకు కడుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) గతేడాదితో పోలిస్తే 10.2 శాతం పెరిగినా.. వ్యవసాయ వృద్ధి ప్రతికూలంగా కొనసాగుతుండటం ఆందోళనకరంగా మారింది. జీఎస్‌డీపీ అంచనాలను తయారు చేసేటప్పుడు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు అటవీ, మైనింగ్, క్వారీలను ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. గతేడాదితో పోలిస్తే 2016–17 సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రాథమిక రంగంలో 4.7 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ఇటీవలే రాష్ట్ర ప్రణాళిక, అర్థ గణాంక శాఖ ప్రకటించింది. కానీ విడిగా వ్యవసాయ వృద్ధిని మాత్రమే పరిశీలిస్తే.. రాష్ట్రంలో రైతుల కష్టాల సాగులోని లోతుపాతులు తేటతెల్లమవుతున్నాయి.