సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన కల్లోలానికి అసలు కారకుడంటూ అఖిలేశ్ వర్గం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అమర్ సింగ్ మొత్తం వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. 'చీకటి చిక్కగా ఉంటేనే పొద్దు రసవత్తరంగా ఉంటుందంటూ' పార్టీ ఎదుర్కొన్న తీవ్ర సంక్షోభం గురించి కవిత వినిపించారు. అఖిలేశ్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ ములాయం నిర్ణయాన్ని ప్రకటించిన నిమిషం(శుక్రవారం సాయంత్రం) నుంచి ఎవ్వరికీ కనిపించకుండా తిరిగిన అమర్‌సింగ్.. శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తలంతా నేతాజీ(ములాయం) వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. చివరికి కథ సుఖాంతం కావడాన్ని స్వాగతించారు.