ఎలాంటి చర్చ లేకుండానే ఆదాయపు పన్ను చట్ట సవరణల బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రెండు సార్లు వారుుదా అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పన్ను చట్టాల(రెండో సవరణ) బిల్లు 2016పై లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ వంటి కేంద్ర పథకాల నిర్వహణకు ఈ బిల్లు ఉపకరిస్తుందని చెప్పారు. రద్దయిన రూ. వెరుు్య, రూ. 500 నోట్లను చట్టవిరుద్ధంగా మార్చేందుకు కొందరి ప్రయత్నాలు ప్రభుత్వం దృష్టికి రావడంతో బిల్లు తెచ్చామన్నారు. తాజా సవరణల ప్రకారం... రద్దయిన కరెన్సీని అక్రమంగా మారుస్తూ పట్టుబడ్డ వారిపై 60% పన్ను, పెనాల్టీలతో కలిపి గరిష్టంగా 85 % వసూలు చేస్తారని జైట్లీ తెలిపారు. బ్యాంకులకు స్వయంగా నల్లధనం వివరాలు సమర్పిస్తే... 50% పన్ను విధిస్తామని, 25% నగదును వెంటనే ఇచ్చేస్తారని, మిగతా 25 % నాలుగేళ్ల అనంతరం ఇస్తారన్నారు. బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు సూచించిన కొన్ని సవరణలకు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి కావడంతో వాటిని తిరస్కరించారు. బీజేడీ ఎంపీ మహతబ్ సవరణను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది.