టిక్..టిక్..టిక్మంటూ గడియారం చప్పుళ్లు రాజకీయ నేతలకు, సంపన్నులకు, బడాబాబులకు వినిపించడంలేదేమోగానీ సామాన్యుడికి, మధ్యతరగతి పౌరుడికి మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని వీరి బతుకులు బ్యాంకుల పాలయ్యాయి. బ్యాంకులు తెరిచే రేపటికోసం ఈ రాత్రి నుంచే గడియలు లెక్కబెట్టుకుంటున్నవారైతే కోకొల్లలు.. రేపు ఎలాగైనా ముందు వెళ్లి డబ్బు చేజిక్కించుకోవాలని అలారం పెట్టుకొని మరి మేల్కొంటున్న పరిస్థితి. పథకం ఫలితం ఎవరికి దక్కేనో? ఎప్పుడు దక్కేనోగానీ, బ్యాంకుల వద్ద పడిగాపులుగాయడం మాత్రం గత నెలరోజులుగా నిత్యకృత్యంగా మారింది.