నెల రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నోట్ల రద్దుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవటం, నవంబర్ 8న ప్రకటించటం వెనక చాలా పెద్ద అధ్యయనమే జరిగింది. మోదీ ఆదేశాలతో ఆరుగురు సభ్యుల బృందమొకటి అహోరాత్రులు శ్రమించింది. పీఎంవో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భేటీ అయితే అనుమానాలొస్తాయని.. ఏకంగా ప్రధాని నివాసంలోని (7 లోక్‌కళ్యాణ్ మార్గ్) రెండు గదుల్లో సెటిలై అధ్యయనం చేసింది. మోదీకి విశ్వాసపాత్రుడైన ఐఏఎస్ అధికారి హస్ముఖ్ అధియా ఈ టీమ్‌కు నాయకత్వం వహించారు. మిగిలిన సభ్యులంతా డేటా, ఆర్థిక విశ్లేషణలో నిపుణులైన యువకులే. (కొందరు మోదీ సోషల్ మీడియా అకౌంట్లను, యాప్‌లను నిర్వహిస్తున్నారు). ఈ టీమ్ సారథి అధియా, ప్రధానికి నమ్మినబంటుగా పనిచేసిన అధికారి. బయటి ప్రపంచంలోనే చాలా తక్కువ మందికే ఈయనతో పరిచయం ఉంది.