తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజెవరు? బిజెపిలో ఇప్పుడు రాజకుంటున్న ప్రశ్న ఇదే. టీడీపీతో పొత్తులో రాజోలు అనే చెల్లని నోటును చంద్రబాబు బీజేపీ జేబులో దోపేశారు. అయితే వింతేమిటంటే ఆ చెల్లని నోటు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. వారిద్దరి బాహాబాహీ ప్రజలకు వినోదాన్ని పంచేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నట్టుండి కండువా మార్చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెల్చిన రాపాక వరప్రసాద్ ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. అయితే అంతకు ముందు నుంచీ బిజెపిలో కండువా వేసుకుని ఉన్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు ఇది ఇబ్బందికరంగా మారింది. పునర్విభజన ప్రక్రియతో నగరం నియోజకవర్గం పి.గన్నవరంగా మారడంతో, వేమా రాజోలునుంచి పోటీ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సీటు తనదే అన్న భరోసాలో వేమా ఇంతకాలం ధీమాగా ఉన్నారు. ఇప్పుడు రాపాక రాకతో వేమా ఆశలు అడియాసలయ్యే పరిస్థితి వచ్చింది. అటు రాపాక వరప్రసాద్ కూడా రాజోలులో బిజెపి తరపున పోటీకి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కినట్టు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. ఇంతలో ఈ సీటు పొత్తు లెక్కల్లో బిజెపి ఖాతాలోకి వెళ్తోందని తెలిసి హడావిడిగా కాషాయ కండువా కప్పుకున్నారు. వేమా కూడా తక్కువేం తినలేదు. 1999 ఎన్నికల్లో అప్పటి నగరం నియోకవర్గం నుంచి అయ్యాజీ వేమా బిజెపి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మధ్యలో ఆయన చిరంజీవి ఊపు చూసి పీఆర్ పీ లో చేరి, పోటీ చేసి, ఓడిపోయి, మళ్లీ బిజెపికి వచ్చారు. ఇప్పుడు రాపాక, వేమాల మధ్య రాజోలు రాజకీయం రాజుకుంటోంది. వీరిద్దరే వాదులాడుకుంటూంటే ఇక ప్రత్యర్థులెందుకు అంటున్నారు అక్కడి ఓటర్లు. బిజెపికి ఎలాంటి పట్టూ లేని రాజోలులో జరుగుతున్న ఈ వింత పోరు గోచీ కోసం పేచీ లాంటిదేనంటున్నారు రాజకీయ పండితులు.
Published Tue, Apr 15 2014 7:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement