అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనకు నిరసనగా కేంద్రం అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే ప్రత్యక్ష నిరసనకు దిగాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్ తల్లిదండ్రులను శనివారం మల్లం పేటలోని వారి నివాసంలో కేటీఆర్ పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రికి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటుందని, అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద, టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మంత్రి వెంట ఉన్నారు. శ్రీనివాస్ భార్య సునయన అమెరికాలో మీడియాతో మాట్లాడిన వీడియోను కేటీఆర్ ఫోన్‌లో వీక్షించారు.