ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని ఆయన చెప్పారు. షిండే బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మంత్రుల బృందం విధివిధానాల్లోని వివిధ అంశాలపై అఖిలపక్ష భేటీ చర్చించి, సూచనలు చేస్తుందని వివరించారు. షిండే నేతృత్వంలోనే ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజనతో నదీ జలాల పంపిణీ, విద్యుత్, ఆస్తుల పంపకం, సరిహద్దుల గుర్తింపు అంశాలపై ఆ భేటీల్లో చర్చలు జరిపింది. జీఓఎం అనుసరించాల్సిన మార్గం, పద్ధతులపైనా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు.. విభజనపై కేంద్ర కేబినెట్‌కు నివేదించే తన సిఫారసులను రూపొందించటంలో అన్ని ముఖ్యమైన అంశాలపైనా భాగస్వాముల అభిప్రాయాలను జీఓఎం తీసుకుంటుంది. కోర్ కమిటీ నిర్ణయం మేరకే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కోర్ కమిటీ భేటీలో మెజారిటీ నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాల మేరకే రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, హోంమంత్రి షిండే, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం, న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. రానున్న ఎన్నికల మీద కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత పరిస్థితిని, హోంశాఖ పరిధిలో చేపడుతున్న చర్యలను, మంత్రుల బృందం పరిశీలనలో ప్రగతిని షిండే ఈ భేటీలో వివరించారని తెలిసింది. రాజ్యాంగంలోని 371(డి) అధికరణ, విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన న్యాయ పరమైన అంశాల గురించి న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ వివరించినట్లు చెప్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పాటుపై మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా కోర్ కమిటీలో తీసుకున్నట్లు సమాచారం. కోర్ కమిటీ భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. విభజనకు సంబంధించి మంత్రుల బృందానికి అన్ని పార్టీలు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు నివేదికలు సమర్పించిన తర్వాత.. మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల బృందానికి నివేదికలు సమర్పించడానికి నవంబర్ 5 వరకు గడువు ఉన్న విషయం విదితమే. గడువు ముగిసిన తర్వాత నాలుగైదు రోజుల్లోపే సమావేశం ఉండే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రపతి ప్రణబ్‌తో షిండే భేటీ కోర్ కమిటీ సమావేశానికి ముందు షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలను ప్రణబ్‌ముఖర్జీ హోం శాఖకు పంపించిన నేపథ్యంలో.. ఈ అంశం మీద కూడా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Published Thu, Oct 31 2013 8:13 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement