రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ ఇస్తామని, ఇకముందు కరెంటు కోతలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో దక్కన్ ఆటో లిమిటెడ్ సంస్థ తయారుచేసిన బస్సులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇస్తున్నాను. గతంలో ఇక్కడ కరెంటు సమస్య విపరీతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత మొదట్లో కరెంటు సమస్య ఉన్నా... మేం చేపట్టిన చర్యల వల్ల ఆ సమస్యను అధిగమించాం. ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు కోతలు ఉండవు. ఈ రోజు 4,320 మెగావాట్లు ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్లకు పెంచబోతున్నాం. ఇప్పటికే రూ.91.5 వేల కోట్లు అంచనాతో పనులు ప్రారంభించాం. నూతన పారిశ్రామిక విధానంలో ప్రకటించిన విధంగా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న పదకొండో రోజునే 17 కంపెనీలకు అన్ని అనుమతులతో స్వయంగా అనుమతి పత్రాలు ఇచ్చాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 1997లో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే వారి కోసం ఆర్టీసీ తరఫున స్లీపర్‌కోచ్ బస్సులను డిజైన్ చేశామని చెప్పారు. అప్పటి బస్సులతో పోల్చి చూస్తే ఇప్పటి బస్సులు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని, త్వరలోనే దక్కన్ ఆటో సంస్థకు చెందిన బస్సులను తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ బీ బీ పాటిల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Published Sun, Jul 12 2015 6:49 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement