చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు, ఆంధ్రా పోలీసులు దాడి చేయగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించారు. ఓ ఇన్స్పెక్టర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారనే సమాచారం అందడంతో గేటు పుత్తూరు మేదరవీధిలోని ఓ నివాసంలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు అక్కడకు చేరుకోగానే తొలుత అక్కడున్న అనుమానితులు ప్రతిఘటించారు. కొద్ది సేపటికే వాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా, మరో ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సోదాల్లో ఓ తుపాకీ, రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందటంతో చెన్నై పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ నిందితుడు. అంతే కాకుండా మధురై పేలుళ్లతో పాటు పలు కేసుల్లో నిందితుడు. ఘటనా స్థలానికి 200 మంది తమిళనాడు బెటాలియన్ పోలీసులు, ఆంధ్రా బెటాలియన్ నుంచి 100 మంది పుత్తూరు చేరుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా బయల్దేరింది. సంఘటనా స్థలానికి తిరువళ్లూరు ఎస్పీ, పుత్తూరు డీఎస్పీతో పాటు మరో ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.