జగన్ దీక్షకు అపూర్వమద్దతు: తరలివస్తున్న జనం | Extraordinary support to jagan samaikya deeksha | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 7 2013 8:11 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన 'సమైక్య దీక్ష'కు రాష్ట్రం నలుమూలల నుంచి అపూర్వ రీతిలో మద్దతు లభిస్తోంది. హైదరాబాద్లో తన క్యాంపు కార్యాలయం ఎదుట జగన్ ఆమరణదీక్షకు కూర్చున్న శిబిరం వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. రెండవ రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్ను చూసేందుకు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్టవ్యాప్తంగా సమైక్యవాదులు జగన్ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. జగన్ సమైక్య దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పలుచోట్ల దీక్షలు చేస్తున్నారు. 72 గంటల బంద్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పలు చోట్ల రిలేదీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జగన్ దీక్షకు మద్దతుగా చిత్తూరు జిల్లా వి.కోటలో అరుణ్‌కుమార్‌రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. అగరంపల్లిలో కేశవులు రెండవ రోజు దీక్ష చేస్తున్నారు. పూతలపట్టులో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సుబ్బారెడ్డి, వినయ్ ఈరోజు నుంచి 48 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ నారాయణ స్వామి వారికి మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో 72 గంటల బంద్ దిగ్విజయంగా కొనసాగుతోంది. రాయదుర్గంలో మహేష్‌ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజుకు చేరింది. కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. మడకశిరలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. కళ్యాణదుర్గంలో ఎల్ మోహన రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో తపోవనంలో జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు. ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి నాయకత్వంలో బంద్‌ చేస్తున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. జగన్ దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ఉమాశంకర్‌ గణేశ్‌ ఆధ్వర్యంలో 72 గంటల బంద్‌ పాటిస్తున్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ బంద్కు మద్దతు తెలిపారు. ప్రాధాన రహదారులు అన్నీ మూసివేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్ కులిడి సురేశ్‌ బాబు ఆధ్వర్యంలో తగరపు వలస జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు. జగన్‌ దీక్షకు మద్దతుగా పార్టీ సమన్వయకర్త కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో కొమ్మాది జాతీయ రహదారిపైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మకు శవ యాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జగన్ దీక్షకు మద్దతుగా పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆముదాలవలసలో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రణస్థలంలో పార్టీ సమన్వయకర్త గొర్లే కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరం జంక్షన్‌లో రూరల్‌ కన్వీనర్‌ వేణుగోపాలకృష్ణ జగన్ దీక్షకు సంఘీభావంగా ఎడ్లబండిపై రిలే నిరాహారదీక్ష చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా విజయవాడలో వంగవీటి రాధ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. సింగ్‌నగర్‌లో పార్టీ నేత గౌతమ్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లో జలీల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో బంద్‌ పాటిస్తున్నారు. పెనమలూరులో పార్టీ నాయకురాలు తాతినేని పద్మావతి 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. గంగూరులో పార్టీ నేత పడమట సురేశ్‌బాబు ఆధ్వర్యంలో బంద్‌ పాటిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement