నల్లగొండ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి పలు పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పిడుగురాళ్ల-గుంటూరు మధ్యలో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో జిల్లా మీదుగా నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో డిండి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య.. పోచంపల్లి చెరువు అలుగుపోయడంతో రేవనపల్లి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టంగూర్ మండలంలోని చెరువులు, కుంటలన్నీ అలుగుపోస్తున్నాయి. ఈదులూరు, ఆరెగూడెం, పందెనపల్లి గ్రామాల్లో వరి నీట మునిగింది. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుండి ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కేతేపల్లి-కొత్తపేట మధ్య మూసీ ప్రాజెక్టు కుడి కాల్వకు గండిపడింది. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉన్న పులిచింతల ప్రాజెక్టులోకి ఏకంగా మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టు ముంపు గ్రామాలైన చింతిర్యాల, రేబల్లె, అడ్లూరు, వెల్లటూరు, నెమలిపురి వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.