తీవ్ర గందరగోళ పరిస్థితులు, నాటకీయ పరిణామాల నడుమ జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 122మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ సహా.. ఆ పార్టీ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ బయటకు గెంటేశారు. దీంతో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. స్పీకర్ తీరు, మార్షల్స్ బలవంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టాలిన్ తన ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే స్పీకర్ ధనపాల్ సభను సమావేశపరిచి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌తోపాటు, ముస్లింలీగ్ తదితర విపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.