అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తాను చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపిస్తానని, అందుకు తనకు 20 నిమిషాల సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఒకవేళ స్పీకర్ తనకు మైకు ఇవ్వకపోతే ఇవే ఆధారాలను తీసుకెళ్లి బయట మీడియాకు ఇస్తానని చెప్పారు. అయితే.. ఈ ఆధారాల గురించి చెప్పడం కాదని, జ్యుడీషియల్ విచారణకు సిద్ధమో కాదో చెప్పాలని అధికార పక్షం పట్టుబట్టింది. విచారణలో ప్రత్తిపాటి మీద ఆరోపణలు రుజువైతే ఆయన రాజీనామా చేస్తారని, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి పుల్లారావు కొన్న భూములపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరింది తామేనని, ఆరోపణలను నిరూపించే అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. తనకు కొద్దిపాటి సమయం ఇస్తే తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ సభ ముందు ఉంచుతానని వైఎస్ జగన్ పదే పదే కోరినా అందుకు స్పీకర్ అంగీకరించలేదు.