రాజమండ్రిలో గోదావరి పుష్కర సందడి మొదలైంది. పట్టణంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మహా హారతి కార్యక్రమం కోలాహలంగా సాగింది. గోదావరి నదీమ తల్లి మహా హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం రాజమండ్రికి వచ్చారు. పుష్కర ఘాట్ వద్ద నిర్వహించిన మహా హారతి కార్యక్రమాన్నిచంద్రబాబు సతీ సమేతంగా వీక్షించారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. క్రీడాకారులు అఖండ జ్యోతితో మహా హారతి కార్యక్రమానికి నాంది పలికారు. దీంతో గోదావరి విద్యద్దీప కాంతులతో మహోజ్వలంగా సరికొత్త శోభను సంతరించుకుంది. మహా హారతి కార్యక్రమం సందర్భంగా పట్టణం అంతా జై గోదావరి మాత అంటూ నినాదాలతో పట్టణం హోరెత్తింది. వీధులు జనసంద్రంగా మారాయి. దేవతామూర్తుల వేషధారణ లతో భక్తి గీతాలు అలపించుకుంటూ సాగిన యాత్రతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపట్టింది. తప్పెట గుళ్లు, కోలాటం, గరగ నృత్యాలు, శక్తి వేషలు. తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంగళవారం ఉదయం గం.6.20ని.లకు గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సందడి నెలకొంది.