పావనవాహిని మహాపర్వం చివరి అంకానికి చేరింది. గోదావరి పుష్కరాల ముగింపు ఘడియలు మరికొద్ది గంటల్లో ఆసన్నం కానున్నాయి. 11 రోజుల పాటు జరిగిన పుష్కరాలు 12వ రోజైన శనివారం సాయంత్రం 6.38 గంటలకు ముగియనున్నాయి. ఇన్ని రోజులుగా అంచనాలకు అందనట్టు.. ఆకాశమే హద్దన్నట్టుగా కోట్ల సంఖ్యలో యాత్రికులు గోదావరి స్నానఘట్టాలకు పోటెత్తి.. పుష్కర పుణ్యస్నానాలు చేశారు. పితృదేవతలకు సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ లక్షలాదిగా పిండప్రదానాలు నిర్వహించారు. ఈ మహాసంబరానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు గోదావరి పుష్కర మహోత్సవాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్, ఆర్ట్స్ కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నిత్యహారతి, లేజర్‌షోతోపాటు భారీ బాణసంచా కాల్పులు జరపనుంది. అలాగే రెండు రైల్వే వంతెనల మధ్య వేలాదిగా ఆకాశదీపాలు గాలిలోకి వదలనున్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కూడా బాణసంచా కాల్పులు ఏర్పాటు చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిటా పుష్కరజ్యోతి’ నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి ఇంటా పుష్కర జ్యోతి వెలిగించాలని కోరింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జన్మభూమి కమిటీలను వినియోగించుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు.