మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేస్తామని, దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇస్తామని తెలిపారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఐదేళ్లకోసారి పింఛనును సవరిస్తుంటామని పారిక్కర్ చెప్పారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుందని రక్షణ మంత్రి తెలిపారు.