తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ కోరారు. అయితే, ప్రతిపక్షాల విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని, కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు.