అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమయింది. పై-లీన్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే సిక్కోలుపై అల్పపీడనం విరుచుకుపడింది. రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. బాహూదా నదికి వరద ముప్పు పొంచివుండడంతో 6 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదయింది. కంచిలిలో 65 సెంటీమీటర్లు, సోంపేటలో 57.5 సెం.మీ, శ్రీకాకుళంలో 54.4 సెం.మీ, పోలాకిలో 51.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందన్న సమాచారంతో సిక్కోలు వాసులు భీతిల్లుతున్నారు.
Published Thu, Oct 24 2013 12:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement