హైదరాబాద్‌లో అక్రమ కట్టడా లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంత పెద్దవ్యక్తికి సంబంధించిందైనా కూల్చివేసేందుకు వెనుకాడేది లేదని పేర్కొన్నారు. నగరంలోని నాలాలు, కాల్వలపై 28 వేల అక్రమ కట్టడాలున్నాయని, వాటన్నింటినీ కూల్చివేస్తామని ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చర్యలు చేపడతామని చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘24 సర్కిళ్లకు 24 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తాం. వీరికి సాయంగా పోలీస్ టీమ్‌లుంటాయి. అక్రమ కట్టడాలకు సంబంధించిన సమాచారం ఇచ్చే ప్రజలకు జీహెచ్‌ఎంసీ రూ.10 వేల నగదు బహుమతి కూడా ఇస్తుంది. వారి పేర్లను రహస్యంగా ఉంచుతుంది’’ అని ప్రకటించారు.