ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రన్న కానుకల పేరుతో రూ. 350 కోట్లు వృథా అయ్యాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కేవలం ఎన్నికల స్టంటు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం పోయాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వచ్చని తెలిపారు. అనంతపురంలో ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే బడ్జెట్లో ఎలాంటి పన్నులు వేయరని ఆశిస్తున్నానని, ఇప్పటికే అన్ని రకాల పన్నులు వేశారని జేసీ అన్నారు. ఏపీలో ఆకలి చావులు లేవని, ప్రభుత్వ పథకాలు కొన్నింటిని తగ్గించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకూ పనికిరాకుండా పోయారని, ప్రజాధనంతో నిర్వహిస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు వృథా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి ఆందోళన చేయాలో కూడా పవన్ కల్యాణే చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామాకు కూడా తాను సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు కాదు.. 53 వేల ఎకరాలు కావాలని ఆయన ఎద్దేవా చేశారు. విలువైన పంటభూముల్లో భూసమీకరణపై పునరాలోచించాలని ఏపీ సర్కారుకు సూచించారు. తాను బీజేపీలోకి వెళ్లే ప్రసక్తి లేదని, చంద్రబాబు తనను బాగానే చూసుకుంటున్నారని అన్నారు. తాను టీటీడీ చైర్మన్ పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.
Published Sat, Mar 7 2015 4:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement