ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర మంత్రుల్లో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రాజధాని కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విజయవాడ తాత్కాలిక రాజధానిపై ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ రోజుకో స్థలాన్ని సూచిస్తున్నారన్నారు. మొదట్లో గుంటూరు-విజయవాడ అన్నారని, ఇప్పుడు విజయవాడ అంటున్నారని కేఈ వ్యాఖ్యానించారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం 500 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందన్నారు. విజయవాడ రాజధాని అయితే ఇరుకైన ప్రాంతంగా ఉంటుందని అన్నారు. దీనివల్ల రాజధానిపై గందరగోళం ఏర్పడిందని, రాజధానిపై కసరత్తు పూర్తి అయ్యేందుకు ఏడాది సమయం పడుతుందన్నారు. ఈలోగా స్మార్ట్ సిటీలు వస్తే రాజధాని అంశాన్ని ప్రజలు పట్టించుకోరని కేఈ పేర్కొన్నారు. కాగా కర్నూలు రాజధాని అవసరం లేదని, కర్నూలును రాజధానిగా కోరుకునే ప్రజలు కూడా తక్కువగా ఉన్నారన్నారు. దీనిపై కర్నూలు నాయకుల్లోనూ సంఘీభావం లేదని, ఎవరికి వారే ఉన్నారన్నారు. జిల్లాలో దాదాపు 32వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అలాగే విమానాశ్రయాలు కూడా అవసరం లేదన్నారు. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో సగం నిలబెట్టుకున్నా.... తన పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈకే కృష్ణమూర్తి అన్నారు. జిల్లాల కేంద్రాలకు 10 కి.మీ పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను ఆయన వెల్లడించారు.