భారత్ కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ కుంభకోణం విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐదు కాల్ సెంటర్లు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసి ఈ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశాయని, దొంగిలించాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్ తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అమెరికాలో 20 మంది అరెస్టు కాగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. హెచ్ గ్లోబల్, కాల్‌మంత్ర, వరల్డ్‌వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపీవో సర్వీసెస్ పేరుతో కాల్‌సెంటర్ల నుంచి ఈ ఫోన్‌కాల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేశాయి. మరోవైపు ఈ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. కీలక సూత్రధారుల్లో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన భోగవల్లి నరసింహ(50)ను ఎఫ్‌బీఐ అధికారులు గురువారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా నగదు కార్యకలాపాలు నిర్వహించాడంటూ ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి టెక్సాస్ రాష్ట్రం నార్తర్న్ జిల్లా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చింది. ఈ మేరకు నార్తర్న్ జిల్లా అటార్నీ శుక్రవారం ప్రకటన విడుదలచేశారు.