వాహనదారులూ బహుపరాక్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ రకాల ఉల్లంఘనలకుగాను విధించే చలానాల మొత్తం కూడా భారీగా పెరిగింది. 2011లో విడుదలైన జీవో నం.108 ప్రకారం రెండింతలు, మూడింతలకు మించి పెరిగిన జరిమానాలను ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రకాలైన ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. 2011లోనే జరిమానాల మొత్తం పెంచినా అమలుకు నోచుకోలేదని, అయితే తాజాగా గతంలో పెంచిన మొత్తాల మేరకే జరిమానా విధించాల్సిందిగా అన్ని పోలీస్‌స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు డీసీపీ తెలిపారు. మూడురోజులుగా ఈ జరిమానాలు అమలు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని చెప్పారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపినా, మైనర్లు వాహనం నడిపినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినవారిని కోర్టుకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తామని మహంతి చెప్పారు.
Published Wed, Jul 17 2013 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement