రాబోయే రెండేళ్లలో తెలంగాణలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండరాదు.. ఇది నా కల..’’ అని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం హాజీపల్లి, కిషన్‌నగర్‌లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యా న్ని పెంచుకొని సొంతకాళ్లపై నిలబడాలన్నారు. గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని.. ఇందుకు కిషన్‌నగర్, హాజీపల్లి గ్రామాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నిరక్షరాస్యతను పారదోలడానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాలే తప్ప ప్రభుత్వాలపైనే పూర్తిగా ఆధారపడడం సమంజసం కాదన్నారు.