పండుగ రోజు తమ ఇంటికి ఆధారమైన పెద్దకొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అతడి మరణవార్త శరాఘాతంలా తగిలింది. జమ్ము కాశ్మీర్లో మంగళవారం నాడు పాకిస్థాన్ దళాల కాల్పుల్లో మరణించిన లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ మృతితో హైదరాబాద్ పాతబస్తీలోని నవాబ్కుంట ప్రాంతంలోగల అతడి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి పెద్దదిక్కు అతడే కావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. బక్రీద్ పర్వదినాన ఈ కుటుంబంలో ఆనందానికి బదులు విషాదం అలముకుంది. పండుగనాడు ఫిరోజ్ఖాన్ వస్తాడని అందరూ ఎదురు చూశామని, తీరా అతడి మరణవార్త రావడంతో అంతా పరేషాన్ అయ్యామని అతడి సమీపం బంధువు ఒకరు చెప్పారు. ఫిరోజ్ఖాన్కు ముగ్గురు పిల్లలున్నారు. ఆ కుటుంబంలో ఇంకా ముగ్గురికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా అతడి మీదే ఉంది. నిన్న రాత్రి రెండు గంటలకు తమకు మొదటి సమాచారం వచ్చిందని, అప్పుడు కూడా బుల్లెట్ తగిలింది తప్ప ఏమీ కాలేదన్నారని, తీరా నిజం చెప్పమని గట్టిగా అడిగితే తర్వాత ఆర్మీలోని ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి ఫిరోజ్ ఖాన్ మరణించినట్లు చెప్పారని అతడి బంధువులు తెలిపారు. దీంతో వృద్ధురాలైన తల్లిని పట్టుకోవడం తమ తరం కావట్లేదని వాపోయారు. జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ జిల్లా మెంధార్లోని హమీర్పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్ఖాన్ మరణించిన విషయం తెలిసిందే.
Published Wed, Oct 16 2013 4:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement