ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో అవినీతిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనలో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. బ్రీఫ్ కేసు, సూట్కేసు పాలన సాగిందని, బిగ్ బాస్కు, స్మాల్ బాబు లోకేశ్లకే ఈ వేల కోట్లు ముట్టాయని ఆయన ధ్వజమెత్తారు. సిమెంట్ ధరలు పెరగడం, ఇసుక మాఫియా, కరెంట్ కొనుగోలు, మద్యం ధరలు, బైరటీస్ వంటి అంశాల్లో చంద్రబాబుకు నేరుగా వేలకోట్లు ముడుపులు ముట్టాయని రఘువీరా విమర్శలు గుప్పించారు. ఏపీ డబ్బును తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని అన్నారు. నోటుకు ఓటు కేసులో దోషి ఎవరో వెంటనే తేలాలని,ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. A1 రేవంత్ కాదని, చంద్రబాబు నాయుడేనని రఘువీరా వ్యాఖ్యలు చేశారు.