వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి విషం కక్కుతున్నారని ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి విమర్శించారు. గతంలో వైఎస్ ఓడిపోతారని అనేక సర్వేలు చెప్పాయని, కాని వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసన్నారు. రాజకీయ ఆటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరగదని తాము నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేశారని చెప్పారు. మూడుసార్లు రాష్ట్రపతిని కలినట్లు తెలిపారు. నితీష్‌కుమార్, మమతాబెనర్జీ, నవీన్‌పట్నాయక్, జయలలిత, కరుణానిధి, శరద్‌పవార్, ప్రకాష్ సింగ్ బాదల్ సహా పలువురు నేతలను జగన్ కలిశారని మేకపాటి వివరించారు. జగన్ టార్గెట్‌గా రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టారన్నారు. జగన్‌కు రాజకీయంగా ప్రతిబంధకాలు సృష్టించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని చెప్పారు. విభజనకు లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనసా, వాచా కోరుకునే వ్యక్తి జగన్ అని ఆయన స్పష్టం చేశారు.