పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై వైఎస్ఆర్ తనయ షర్మిల నిప్పులు చెరిగారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శనివారం పార్వతీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని వ్యాపారాలను బొత్స సత్యనారాయణ తన ఆధీనం ఉంచుకున్నారన్నారని షర్మిల ఆరోపించారు. సొంత ఇలాఖా విజయనగరం జిల్లాలోనే బొత్సను ప్రతి ఒక్కరు ఈసడించుకుంటున్నారని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహానేత మరణంతో ప్రతి ఒక్కరు ఏదో విధంగా నష్టపోయామని, అయితే వైఎస్ మరణంతో బొత్స మాత్రం అత్యంత లబ్ది పొందారని జిల్లా ప్రజలు చెబుతున్నారని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. కిరణ్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై ధరల భారం మోపి చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆమె ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పని చేయడం చేతకాకపోయిన, ఆయన మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంట్, గ్యాస్ ధరలు పెంచలేదని షర్మిల గుర్తు చేశారు. ధరలు పెంచని వైఎస్ అరుదైన ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహానేత హయంలో రాష్టంలో జరిగిన సంక్షేమాన్ని షర్మిల ఈ సందర్భంగా వివరించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాయని షర్మిల ఆరోపించారు. త్వరలో జగన్ బయటకు వస్తారని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వైఎస్ సువర్ణ పాలన రాష్ట్రంలో వస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఉదయించే సూర్యుడిని అరచేయి అడ్డు పెట్టి అడ్డుకోలేరని షర్మిల అన్నారు.