స్విస్ చాలెంజ్ వ్యవహారం అనూహ్య మలుపు తీసుకుంది. హైకోర్టు పదేపదే ఆక్షేపిస్తుండడం, అక్షింతలు వేస్తుండడంతో ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఆట మొదలుపెట్టింది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని రాష్ర్ట ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. పోటీ ప్రతిపాదనలకు సంబంధించి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలపడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబలింగ్ (ఏపీఐడీఈ) చట్టం 2001కు చట్ట సవరణలు చేసి ఆర్డినెన్స్ జారీ చేశామని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.