కేంద్ర టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. భారీ భద్రత మధ్య కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలోని 9మంది సభ్యుల బృందం నగరానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, అంశాలపై టాస్క్‌ఫోర్స్ బృందం ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అధికారులతో చర్చించనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కేంద్రానికి ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. ప్రధానంగా హైదరాబాద్‌ను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని పరిధితోపాటు ఆ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణ ఎలా ఉండాలి? ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలా? లేక తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధీనంలో ఉండాలా? అనే అంశాలపై కూడా టాస్క్‌ఫోర్స్ బృందం దృష్టి సారించనుంది. ఈ బృందం ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహించే టాస్క్‌ఫోర్స్ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర అధికారులు డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, మాజీ డీజీపీలు హెచ్.జె.దొర, అరవిందరావు, ఆంజనేయరెడ్డి, ఎ.కె.మహంతి, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎ.కె.ఖాన్, జె.వి.రాముడు, విశ్వజిత్ కుమార్, చారు సిన్హా, మల్లారెడ్డి, దామోదర్, ఎన్.ఆర్.కె.రెడ్డి, కె. సజ్జనార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆస్కీ డీజీ ఎస్.కె.రావులున్నారు.
Published Tue, Oct 29 2013 10:10 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement