రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే రోజు రానేవచ్చింది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రానుంది. ఇందుకోసం కేంద్రం రంగం సిద్ధం చేసింది. లోక్‌సభలో జీరో అవర్ పూర్తయిన తరువాత బిల్లును సభ ముందుంచనుంది. బిల్లు ప్రతులను బుధవారమే ఎంపీలకు అందజేసింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు లోక్‌సభ ఎజెండాలో మాత్రం ఈ అంశాన్ని పొందుపరచలేదు.