విజయనగరం రణరంగం.. గాల్లోకి పోలీసు కాల్పులు | Turmoil in vizianagaram police fire into air | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 5 2013 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

విజయనగరం రణరంగంగా మారింది. సమైక్యవాదులు తీవ్రస్థాయిలో విజృంభించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిపై సమైక్యవాదులు, విద్యార్థులు విరుచుకుపడ్డారు. బొత్స నివాసంతో పాటు ఆయనకు చెందిన లాడ్జి, కళాశాల.. అన్నింటినీ టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు పీసీసీ అధ్యక్షుడేనని బలంగా నమ్ముతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడి రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న ఇటుక రాళ్లను తీసుకుని బొత్స ఇంటిపైన, పోలీసుల మీద విసిరికొడుతున్నారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలం అవుతూనే ఉన్నాయి. పోలీసులు లాఠీ చార్జి చేయడంతో పాటు.. గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పదే పదే పోలీసులు తరిమి కొట్టడం, విద్యార్థులు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ రాళ్లతో ముందుకు రావడం వంటివి ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. బొత్సకు చెందిన సత్యా స్టోన్ క్రషర్పై కూడా సమైక్యవాదులు దాడి చేశారు. దాంతో స్టోన్ క్రషర్ పూర్తిగా ధ్వంసమైంది. నలుగురు ఏసీపీ స్థాయి అధికారులతో బొత్స ఇంటి వద్ద భద్రత ఏర్పటుచేసినా, విద్యార్థులు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. అడుగడుగునా బ్యారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినా, వీధి మొత్తం రాళ్లు కనిపిస్తున్నాయి. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే పోలీసులు కావాలని మంత్రికి కొమ్ము కాస్తూ తమను రెచ్చగొడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు.. బొత్స ఆస్తులపై సమైక్యవాదుల దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆందోళనలను అడ్డుకునేందుకు ఏలూరు రేంజ్ డీఐజీని విజయనగరం జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఐజీ వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement