పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు గురువారం లోక్‌సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాల సభ్యులు ఆవేశాలతో ఊగిపోతూ సభను యుద్ధ క్షేత్రంగా తలపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ ఐదు నిమిషాలు కూడా కొనసాగని పరిస్థితి నెలకొంది. తొలుత స్పీకర్ సుమిత్రామహాజన్ వ్యాపమ్, ఐపీఎల్ స్కాంలు తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదాతీర్మానాలతో పాటు, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రత్యేక హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానానికై ఇచ్చిన నోటీసును తిరస్కరించారు. ఈ సమయంలో యథావిధిగా కాంగ్రెస్ నే తృత్వంలోని పలు విపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టుకుని పోడియం వద్దకు దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార బీజేపీ సభ్యులు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ధరించి తమ స్థానాల నుంచి ముందుకు వచ్చారు.టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించినప్పటికీ.. కొన సాగే పరిస్థితి లేకపోవటంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన... తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా మునుపటి ఘట్టమే పునరావృతమైంది. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కూడా పోడియం సమీపంలోకి దూసుకొచ్చారు. వీరికి మద్దతుగా ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో నిలుచుని నినాదాలు చేశారు. రాబర్ట్ వాద్రాకు వ్యవసాయ భూములు కట్టబెట్టి మళ్లీ అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. కిసాన్ కా జమీన్ దామాద్ కో బాంటే..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై జవాబు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ‘బ్రష్టాచార్ కో జయ్ జయ్ కర్‌హై.. యే బేషరమ్ సర్కార్ హై..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీతో కలసి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తమ పార్టీ సభ్యులను వారి వారి స్థానాలకు వెళ్లేలా ఒప్పించారు. వాద్రాను సభ ముందుకు రప్పించాలి ఈ గందరగోళం మధ్యే బీజేపీ సభ్యుడు ప్రహ్లాద్‌జోషీ నిలుచుని.. రాబర్ట్ వాద్రా పార్లమెంటు సభ్యులనుఅగౌరవపరిచారని, ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని సభాహక్కుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని పట్టుపట్టారు. ‘‘వాద్రా కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, దానితో పాటే వారి దృష్టి మళ్లింపు రాజకీయ ఎత్తుగడలు మొదలవుతాయని, దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేయలేరని, దేశానికి ఇలాంటి నాయకులునేతృత్వం వహిస్తుండటం పట్ల చింతిస్తున్నానని.. వాద్రా వ్యాఖ్యానించారు. ఆయన పార్లమెంటులోని సభ్యులనే కాకుండా పార్లమెంటు మొత్తాన్నే కించపరిచారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చారు. అందువల్ల వాద్రాను తక్షణం సభకు పిలిపించి మందలించాలి. ఆయనకు శిక్ష పడాలి.’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తీవ్ర ఆగ్రహం తో తన స్థానం నుంచి లేచి నిల్చొని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు స్వరాన్ని పెంచుతూ తమ నినాదాలను మరింత ఉధృతం చేశారు.
Published Fri, Jul 24 2015 8:12 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement