రాష్ట్ర విభజన అంశం అన్ని ప్రాంతాల్లో సెగ రేపుతోంది. తాజాగా రాయలసీమ అస్థిత్వాన్ని, ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి దీక్షకు దిగారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం బైరెడ్డి ఇందిరా పార్క్ వద్ద 52 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. రాయలసీమ విభజనకు తాము అంగీకరించేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ సంగతి ఏమో.... ముందు రాయలసీమ సంగతి తేల్చాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలుపుతామని చర్చించడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ ఎమ్మెల్యేలు విభజనపై ఎందుకు మాట్లాడటం లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతాన్ని రెండుగా చీల్చాలని చూస్తే ప్రజలు తిరగబడతారని రాయలసీమ జేఏసీ హెచ్చరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా రాయలసీమ జేఏసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు.