ఈజిప్టు అధ్యక్ష స్థానంలో చీఫ్ జస్టిస్ నియామకం | | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 4 2013 5:09 PM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM

ఈజిప్టులో తిరుగుబాటు ఫలితంగా అధికారంలోకి వచ్చిన ప్రజాస్వామిక ప్రభుత్వ పాలన మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రజల డిమాండ్లను నెరవేర్చేందుకు సైన్యం విధించిన 48 గంటల గడువును తోసిపుచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ తన పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో సైనిక కుట్రకు తెరలేచింది. ముర్సీని పదవి నుంచి తప్పించిన సైన్యం, ఆయన స్థానంలో రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించింది. దేశంలో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ముర్సీ ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదు. అంతకు ముందు, ముర్సీ దేశాన్ని వీడి వెళ్లకుండా సైన్యం ఆయనపై ఆంక్షలు విధించింది. ముస్లిం బ్రదర్‌హుడ్ నాయకులు మహమ్మద్ బడీ, ఖైరాత్ ఎల్ షాతేర్‌లపై కూడా సైన్యం ప్రయాణ నిషేధాన్ని విధించింది. ఇదిలా ఉండగా, చరిత్రలో కచ్చితంగా చెప్పుకోవాలంటే ఈజిప్టులో ప్రస్తుతం జరుగుతున్నది సైనిక కుట్రేనని ముర్సీ జాతీయ భద్రతా సలహాదారు ఎస్సాం అల్ హద్దద్ బుధవారం ‘ఫేస్‌బుక్’లో వెల్లడించారు. ‘ఫేస్‌బుక్’లో తాను పోస్ట్ చేసిన ఈ మాటలే తన తుది పలుకులు కావచ్చని ఆయన పేర్కొన్నారు. ముర్సీ 48 గంటల అల్టిమేటంను తోసిపుచ్చడంతో సైన్యం రంగంలోకి దిగి, కైరోలోని అధ్యక్ష భవనం సహా కీలక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తీసుకుంది. ముర్సీ రాజీనామా కోరుతూ పెద్దసంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడంతో ఈజిప్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, అంతకు ముందు ముర్సీ టీవీ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈజిప్టు కోసం తాను ప్రాణాలనైనా అర్పిస్తానని, అయితే, రాజీనామా చేయడం ద్వారా రక్తపాతానికి అనుమతించబోనని అన్నారు. సైన్యంతో తలెత్తిన సంక్షోభానికి తెరదించేందుకు ఏకాభిప్రాయంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో పాటు ఇస్లామిస్టులు రూపొందించిన వివాదాస్పద రాజ్యాంగాన్ని సవరించేందుకు కమిటీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈజిప్టు ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ సిసీ భవిష్యత్ కార్యాచరణపై విపక్ష నేత మహమ్మద్ ఎల్‌బరాడీతో పాటు సున్నీ ముస్లిం, క్రైస్తవ నేతలతో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, ముర్సీ ఇక ఎంతమాత్రం నిర్ణయాధికార బృందంలో భాగంగా లేరని ఒక సీనియర్ ఉన్నతాధికారి చెప్పినట్లు ప్రభుత్వ అధీనంలోని ‘అల్-అహ్రమ్’ పత్రిక వెల్లడించింది. ముర్సీని సైన్యం గృహనిర్బంధంలో ఉంచినట్లు కూడా మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే, సైన్యం ఆ కథనాలను తోసిపుచ్చింది. మరోవైపు, కైరో సహా పలుచోట్ల బుధవారం ముర్సీకి వ్యతిరేకంగా ‘టామరాడ్’ నేతృత్వంలో, ఆయనకు అనుకూలంగా ఇస్లామిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. కైరో వర్సిటీలోను, గిజా ప్రాంతంలోను జరిగిన ఘర్షణల్లో 23 మంది మృతిచెందగా, 200 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా, సైనిక పాలన దిశగా ఈజిప్టులో జరుగుతున్న పరిణామాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement