తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ చిన్నారి మాయం అయింది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల పురుడు కోసం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఈమె శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు తన బిడ్డ పక్కలోనే వుందని అర్థరాత్రి మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే పాప కనిపించకుండా పోయిందని బాధితురాలు కమల కన్నీటి పర్యతం అయ్యింది. సమాచారం అందుకున్న అలిపిరి పొలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పసికందు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు.