తన ఢిల్లీ పర్యటన విజయవంతం అయినట్లు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఉమాభారతి తనకు చెప్పారన్నారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టాలని జెన్కోను ఆదేశించినట్లు తెలిపారు. తమ రైతులకు అవసరం అయ్యేంత వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. పీపీఏలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని తాను కోరిననట్లు హరీశ్ రావు చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరామన్నారు. ఈ పర్యటనలో తాను ఎన్టీపీసీ ఛైర్మన్ను కూడా కలిశానని, 1600 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు. త్వరలోనే ఆ ప్లాంటు పనులు మొదలవుతాయని చెప్పారు. మరో 2,400 మెగావాట్ల ప్లాంటు స్థాపనకు కూడా అవసరమైన భూమిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, ప్రాణహిత- చేవెళ్లకు అవసరమైన అనుమతులన్నీ ఇప్పించాలని సీడబ్ల్యుసీ ఛైర్మన్ను కోరామని హరీశ్రావు అన్నారు.