‘మా ప్రాచీన క్రీడపై నిషేధం విధిస్తారా? ఇది తమిళ సంస్కృతిపై దాడి చేయడమే’ అంటూ చెన్నై సాగరతీరాన తమిళయువత శివాలెత్తింది. జల్లికట్టుపై విధించిన నిషేధం ఎత్తేయాలంటూ వేలాది మంది యువకులు మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీలు, వర్సిటీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి బీచ్‌కు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సహా అన్ని పార్టీల, కోలివుడ్ మద్దతు తోడవడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ ఆందోళనలు పెరగడంతో తమిళసర్కారు అప్రమత్తమైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు 51 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధానిని కలవనున్నారు.