సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన దీక్ష చరిత్రాత్మకమని పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త కాటం అరుణమ్మ అన్నారు. విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఉదయం ఒంగోలు మినీ స్టేడియం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా 150కిపైగా వాహనాలతో కూడిన ర్యాలీని అరుణమ్మ ప్రారంభించి మాట్లాడారు. జైలులో ఉండి కూడా జాతి కోసం తపనపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని కన్న విజయమ్మ జీవితం ధన్యమైందన్నారు. జాతి ఐక్యత కోసం విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం గర్వించదగినదని పేర్కొన్నారు. దీక్షతో విజయమ్మ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. విజయమ్మ దీక్ష స్ఫూర్తితో ప్రతి పల్లె ఉద్యమంలో పాల్గొనాలని, అప్పుడే ఢిల్లీ పీఠం కదిలి రాష్ట్ర విభజన ప్రకటన ఉపసంహరించుకుంటారని తెలిపారు. ఉద్యమానికి మహిళలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని కోరారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే విభజన నిర్ణయమన్నారు. జాతి ఐక్యత కోసం విజయమ్మ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని తెలిపారు. హైదరాబార్ ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి) మాట్లాడుతూ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఉద్యమాన్ని అణచడం సాధ్యం కాదన్నారు. అనంతరం ర్యాలీ స్థానిక రాజధాని సెంటర్, చర్చి, పాత మార్కెట్ సెంటర్ల మీదుగా గుంటూరుకు తరలివెళ్లారు. సంతనూతలపాడు నియోజకవర్గ నేతలు 50కిపైగా వాహనాల్లో మద్దిపాడులో ర్యాలీలో కలిశారు. గుంటూరు వెళ్లిన వారిలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పీ అనూరాధ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, వివిధ విభాగాల కన్వీనర్లు ముదివర్తి బాబూరావు, యరజర్ల రమేష్, బొప్పరాజు కొండలు, దుంపా చెంచిరెడ్డి, నాయకులు సింగరాజు వెంకట్రావు, ఆవుల జాలయ్య, కావూరి సుశీల, బడుగు ఇందిర, రమాదేవి, ఆవుల జాలయ్య, తదితరులు ఉన్నారు.