నేడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విజయమ్మ పర్యటన | YS Vijayamma visits cyclone hit khammam district | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 31 2013 6:49 AM | Last Updated on Wed, Mar 20 2024 3:59 PM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం జిల్లాలో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. బాధిత రైతులతో మాట్లాడుతారు. మధిర నియోజకవర్గంతో మొదలయ్యే ఆమె పర్యటన పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లితో ముగుస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ‘ఉదయం 8 గంటలకు విజయమ్మ మధిరకు చేరుకుంటారు. మధిర, బోనకల్, వైరా, కొణిజర్ల, ఖమ్మంఅర్బన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో ఆమె పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతుల సాధకబాధకాలు తెలుసుకుంటారు. నేలకొండపల్లిలో పంటల పరిశీలన అనంతరం నల్లగొండ జిల్లా కోదాడకు వెళ్తారు.’ పంటలు దెబ్బతిని...మనోస్థైర్యం కోల్పోయిన రైతులను ఓదార్చేందుకు ఆమె జిల్లాకు వస్తున్నట్లు చెప్పారు. పర్యటన సాగేది ఇలా... ఉదయం 8 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడి నుంచి బోనకల్ మండలం కలకోటకు వెళ్తారు. కలకోట, వైరా మీదుగా కొణిజర్ల మండలం పల్లిపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం అర్బన్ మండలం వి.వెంకటాయపాలెం వెళ్తారు. ఖమ్మం నగరం మీదుగా ముదిగొండ మండలం వెంకటాపురం చేరుకొని పంటలను పరిశీలిస్తారు. అనంతరం నేలకొండపల్లిలో పంటలను పరిశీలించి మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కోదాడకు వెళ్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement