లార్డ్స్ టెస్టులో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మురళీ విజయ్ (247 బంతుల్లో 95; 11 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... రవీంద్ర జడేజా (57 బంతుల్లో 68; 9 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (71 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచి భారీ ఆధిక్యాన్ని అందించారు. ఫలితంగా ఆదివారం నాలుగో రోజు ధోని సేన రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 342 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. రూట్ (14 బ్యాటింగ్), అలీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కుక్ (22), బాలెన్స్ (27)తో పాటు మిగతా వారు విఫలమయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయానికి 214 పరుగుల దూరంలో ఉంది. మరో ఆరు వికెట్లు తీస్తే విజయం భారత్‌ను వరిస్తుంది. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా... షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.