నిషేధంపై కోర్టుకెక్కిన జ్వాల | Jwala Gutta moves court against BAI's life ban threat | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 10 2013 1:21 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

తనపై జీవితకాల నిషేధం విధించాలన్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదనపై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఓ పిటిషన్ దాఖలు చేశామని బ్యాడ్మింటన్ ప్లేయర్ తండ్రి క్రాంతి గుత్తా వెల్లడించారు. ఈ పిటిషన్ పరిశీలించిన జస్టిస్ వీకే జైన్ నేడు (గురువారం) విచారణ జరపనున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని అక్టోబర్ 7న బాయ్ జారీ చేసిన ఆర్డర్‌ను కొట్టి వేయాలని జ్వాల తన పిటిషన్‌లో పేర్కొంది. తనపై తీసుకోవాలనుకుంటున్న చర్య సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బాయ్ విఫలమైనప్పుడు వాటిని పరిశీలించి స్వతంత్ర నివేదిక ఇచ్చేలా కేంద్ర క్రీడాశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. నెల రోజుల పాటు అంతర్జాతీయ ఈవెంట్లకు జ్వాల పేరును పరిశీలించొద్దని చెబుతూ ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని బాయ్ నియమించింది. దీనిపై స్పందించిన జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిం చింది. మరోవైపు జ్వాల కోరితే ఈ వివాదాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. మరో షాక్! సాక్షి, హైదరాబాద్: తనకు న్యాయం చేయాలంటూ గుత్తా జ్వాల కోర్టు గడపకెక్కిన కొద్ది సేపటికే ఆమెకు ‘బాయ్’ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఎంట్రీ ఖరారైన డెన్మార్క్ ఓపెన్‌నుంచి కూడా ఆమెను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీనుంచి జ్వాల ఎంట్రీని ‘బాయ్’ విత్ డ్రా చేసుకుంది. దాంతో ఆమె ఇందులో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది. తాజా పరిణామంతో తాను షాక్‌కు గురైనట్లు ఆమె ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది. ‘షాక్‌కు గురయ్యాను... నాకు మాటలు రావట్లేదు... నా ఎంట్రీని విత్ డ్రా చేశారు. కనీసం నాకు సమాచారమివ్వలేదు. మన వ్యవస్థ ఏ తరహాలో నడుస్తోంది. ఎవరైనా చెప్పండి’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ నెల 15నుంచి ప్రారంభం కావాల్సిన డెన్మార్క్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప జంట, టాప్ సీడ్ జోడి గ్జియోలి వాంగ్-యంగ్ యు (చైనా)తో తలపడాల్సి ఉంది. జ్వాల- అశ్విని ఎంట్రీని విత్‌డ్రా చేసిన కొన్ని క్షణాల్లోనే టోర్నీ అధికారిక వెబ్‌సైట్‌లో తొలి రౌండ్ ఫలితాన్ని ‘వాకోవర్’గా పెట్టేయడం విశేషం!

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement