సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడానికి అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఓ ముఖ్యమంత్రిగా కాకుండా, సాధారణ పౌరుడిగా, సగటు కన్నడ వ్యక్తిగా మాట్లాడుతున్నానని చెబుతూ ‘కాలా’ సినిమాను ఇప్పుడు విడుదల చేయడం నిర్మాతలకు శ్రేయస్కరం కాదని చెప్పారు.వారు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటిస్తుందని పేర్కొన్నారు. కావేరీ జలాల వివాదం సద్దుమణిగిన అనంతరం విడుదల చేస్తే బావుంటుందని అన్నారు. కన్నడ ఫిల్మ్ చాంబర్, కన్నడ ఆర్గనైజేషన్లు సైతం ‘కాలా’ విడుదలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.