43 ఏళ్ల సినీ ప్రయాణంలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ బుల్లితెరపై తొలిసారి దర్శనమిస్తున్నాడు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో భాగంగా బేర్ గ్రిల్స్‌తో కలిసి నెల క్రితం అడవిబాట పట్టిన రజనీ రెండు రోజులపాటు వన్య మృగాల ఆవాసంలో గడిపాడు. డిస్కవరీ చానెల్‌లో ఈ షో త్వరలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. రజనీ, బేర్ గ్రిల్స్ ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. అడవిలోని ఓ దారి పక్కన టాప్‌లెస్ జీప్‌ను ఆనుకుని ఉన్న రజనీ, గ్రిల్స్ లుక్ అదిరిపోయింది. అడ్వంచర్ థీమ్‌తో బ్యాగ్రౌండ్‌లో అగ్ని కీలలు, నిప్పు కణికలతో ఉన్న ఇద్దరి క్లోజప్ సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. 15 సెకండ్ల నిడివి గల ఈ మోషన్ పోస్టర్‌ను గ్రిల్స్ ట్విటర్‌లో షేర్ చేశాడు.
వన్య ప్రపంచం నేపథ్యంలో ఎంతో మందితో కలిసి పనిచేశానని, అయితే, రజనీకాంత్‌తో పనిచేయడం ప్రత్యేకమని అన్నాడు. త్వరలోనే డిస్కవరి చానెల్‌లో మీ ముందుంటామని తెలిపాడు. లవ్ ఇండియా. #తలైవా అంటూ గ్రిల్స్ ట్వీట్ చేశాడు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. షూటింగ్ చేస్తున్న క్రమంలో రజనీకి స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్‌తో ఈ షోని నడిపిస్తుంటారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు.