పాదయాత్ర ప్రారంభించి నేటికి సరిగ్గా 14 నెలలు గడిచిపోయాయి. ఉదయం పాదయాత్ర ప్రారంభంలోనే చంద్రబాబుపై ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని నాతో ఆవిష్కరింపజేశారు. శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా వలసల కథలు కదిలించాయి. వలసల్లో అగ్రస్థానం ఇచ్ఛాపురం నియోజకవర్గానిదే. ఈ పాలనలో వ్యవసాయం కష్టమైంది. చేపల వేట భారమైంది. పరిశ్రమలు లేవు.. ఉపాధి కరువైంది. ఉపాధి పనులూ లేవాయే. వలసలు తప్ప మరో మార్గం లేని దుర్భర పరిస్థితి. ఎక్కడో దూరాన చెన్నైలో, కోల్‌కతాలో బిల్డింగులు కూలినా, పాకిస్థాన్ సముద్ర జలాల్లో అక్కడి సైన్యానికి బందీలుగా చిక్కినా, విదేశాలకు పంపే బ్రోకర్ల చేతుల్లో మోసపోయినా, అండమాన్ దీవుల్లో, గల్ఫ్ దేశాల్లో విషాద గాథలు బయటపడ్డా.. బాధితుల్లో శ్రీకాకుళం జిల్లా వాసుల పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వేలాదిమంది కాలే కడుపులతో వలస వెళ్లడం ప్రభుత్వ వైఫల్యమే. వలస కూలీల కష్టాలు వింటుంటే మనసంతా బరువెక్కిపోయింది. కురేష్, మహాలక్ష్మిల కుమారుడు దుంపరాజు అలా వలస వెళ్లిపోయి రెండేళ్లవుతున్నా ఆచూకీ లేదట. అలాంటి కథే రాజేశ్వరిది. ఆమె భర్త బైరాగి మూడేళ్లయినా ఇంటికి తిరిగిరాలేదట. చాలా బాధనిపించింది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి కనీస ప్రయత్నమే చేయని ప్రభుత్వాన్ని ఏమనాలి? దళారీ వ్యవస్థలతో రైతాంగాన్ని, మత్స్యకారులను దెబ్బతీస్తున్న ఈ పాలకులే వలసలకు బాధ్యులు కారా?