రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన లబ్ధిదారులను ఈ నెల 20వ తేదీ నుంచి ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఆయా పథకాల లబ్ధిదారుల ఎంపికను డిసెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం చెప్పారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, జగనన్న అమ్మ ఒడి, నాయీ బ్రాçహ్మణులకు నగదు, వైఎస్సార్ కాపు నేస్తం తదితర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలను గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా డిస్ ప్లే బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఆయా పథకాలకు అర్హులైన వారి జాబితాలను కూడా డిస్ ప్లే బోర్డులో ఉంచాలని సూచించారు.