టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు బూతుపురాణంపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. నామాది పర్సనల్ విషయమంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇంకా ఆయనతో మాట్లాడలేదని అన్నారు. మరోసారి నామా భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్‌రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్‌రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.