గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. నిందితుడి అరెస్టులో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ అందోళనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ నేపథ్యంలో దాచేపల్లిలో గురువారం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ వెంకటప్పల నాయుడు పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.